కామన్వెల్త్ గేమ్స్: బాక్సింగ్‌లో మేరీ కోమ్కు, గౌరవ్‌కు స్వర్ణం
కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా భారతీయ బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా భారతీయ బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల 45-48 కేజీల విభాగంలో ఆమె ఈ ఘనతను సాధించారు. అలాగే పురుషుల బాక్సింగ్‌లో గౌరవ్ సోలంకీ కూడా తన సత్తాను చాటారు. 52 కేజీల విభాగంలో ఆయన బంగారు పతకాన్ని సాధించారు. మేరీ కోమ్ తొలిసారిగా ఈ క్రీడల్లో పాలుపంచుకోవడం విశేషం.
ఒలింపిక్ విజేత అయిన మేరీకోమ్ ఐర్లాండ్‌కు చెందిన ప్రత్యర్థి క్రిస్టినా ఓ హరాను 5-0 తేడాతో ఓడించి ఈ ఘనతను సాధించడం గమనార్హం. మేరీ మ్యాచ్ ప్రారంభమైన మొదటి నుంచే డామినేటింగ్‌తో ఆడడంతో క్రిస్టినా ఏ విధంగానూ ఆమెకు సరైన పోటీ ఇవ్వలేకపోయింది. దాంతో రెండో రౌండ్ పూర్తి అయ్యేలోపే పూర్తిగా మ్యాచ్ పై పట్టు సాధించింది మేరీ కోమ్.
మేరీ కోమ్ సాధించిన పతకంతో భారత్ ఖాతాలో 18వ బంగారు పతకం చేరింది.ఇక పురుషుల విభాగంలో కూడా తొలిసారిగా కామన్వెల్త్ ఆడుతున్న గౌరవ్ సోలంకీ కూడా ఐర్లాండ్ బాక్సర్ బ్రెండన్ ఇర్వీన్‌ను 4-1 పాయింట్లతో ఓడించడంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది.