మరోసారి వివాదంలో మహమ్మద్ కైఫ్
భారత వెటరన్ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
భారత వెటరన్ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్‌లో పాకిస్థాన్ గెలవడం, ఆ జట్టు ఆటగాడు ఫఖర్ జమాన్ 91 పరుగులతో రాణించడంపై హర్షం వ్యక్తంచేస్తూ కైఫ్ ట్వీట్ చేశారు. దీంతో దేశద్రోహివంటూ పలువురు నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
'ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడి టీ20 సిరీస్ గెలిచినందుకు పాకిస్థాన్‌కు అభినందనలు. జట్టు ఆటగాడు ఫఖర్ జమాన్‌కు శుభాకాంక్షలు' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఆదివారం ఫైనల్లో పాకిస్థాన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు షార్ట్ (76) , ఫించ్ (47) తొలి వికెట్‌కు 95 పరుగులు చేశారు. ఆపై ఎవ్వరూ చెప్పుకోదగ్గ రన్స్ చేయలేదు. మహ్మద్ ఆమిర్ (3), షాదాబ్ ఖాన్ (2) ఆసీస్‌ను కట్టడి చేశారు. అనంతరం ఓపెనర్ ఫఖర్ జమాన్ (91) చెలరేగడంతో పాక్‌కు విజయం వరించింది. కాగా ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్ లో అగ్రస్థానానికి చేరుకుంది.