ఐపీఎల్‌లో ధోనీ బ్యాటింగ్ స్థానం మారొచ్చు..!
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై తొలి మ్యాచ్ ఆడనుంది. వాంఖడే మైదానంలో ఏప్రిల్ 7న ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ ఏడాది ఐపీఎల్2018లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్స్‌మన్‌గా అద్భుతపాత్ర పోషిస్తాడని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అంటున్నాడు. అంతేకాదు ధోనీ బ్యాటింగ్ స్థానంలో మార్పు కూడా ఉండొచ్చని, మూడు లేదా నాలుగు స్థానాల్లో వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేధం ముగించుకుని తిరిగి అడుగుపెట్టింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆటగాళ్లు చెన్నై చేరుకుని శిక్షణ పొందుతున్నారు. తాజాగా ఆ జట్టు కోచ్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ..‘ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ బ్యాట్స్‌మన్‌గా కీలకపాత్ర పోషించనున్నాడు. అందుకోసం అతడు చాలా కష్టపడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో భారీ షాట్లు కొట్టేందుకే ప్రయత్నిస్తున్నాడు. కచ్చితంగా అతని బ్యాటింగ్ స్థానంలో మార్పు ఉంటుంది. జట్టు అవసరాలకు దృష్ట్యా మార్పులు చోటు చేసుకుంటాయి. కేదార్ జాదవ్, అంబటి రాయుడు, జడేజా, బ్రావో, హర్భజన్, కర్ణ్ శర్మ తదితర ఆటగాళ్లతో మా జట్టు ఎంతో బలంగా ఉంది. ఇక కాంబినేషన్లపైనే మా దృష్టి’ అని ఫ్లెమింగ్ తెలిపాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై తొలి మ్యాచ్ ఆడనుంది. వాంఖడే మైదానంలో ఏప్రిల్ 7న ఈ మ్యాచ్ జరగనుంది.