భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వల్లే తాను పదవిని కోల్పోయానని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. 2008లో తాను కోహ్లీని ఒక సెలెక్టర్ పదవిలో ఉండి ఎంపిక చేసినప్పుడు అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌తో పాటు కెప్టెన్ ధోనికి తన నిర్ణయం నచ్చలేదని వెంగ్‌సర్కార్ తెలిపారు. కోహ్లి అండర్‌–19 ప్రపంచకప్‌ గెలవడం వల్లే ఆయన ప్రతిభను గుర్తించి తాను సెలెక్ట్ చేశానని వెంగ్‌సర్కార్  తెలిపారు.


అయితే అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌తో పాటు బిసిసిఐ ట్రెజరర్ శ్రీనివాసన్ కూడా కోహ్లీ ఎంపికను వ్యతిరేకించారని.. తమ చెన్నై ఫ్రాంచైసీలో ఆడుతున్న బద్రీనాథ్‌కి అవకాశం ఇవ్వాలని కోరారని వెంగ్‌సర్కార్ తెలిపారు. ఆ ఏడాది బద్రీనాథ్ 800 పరుగులు కూడా చేశారని.. ఆ విషయాన్ని గమనించి ఆ క్రికెటర్‌కి అవకాశం ఇవ్వాలని శ్రీనివాసన్ తెలిపారని అన్నారు. అయితే తాను అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొనే కోహ్లీని ఎంపిక చేశానని.. ఆ నిర్ణయం నచ్చక శ్రీనివాసన్, అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు శరద్ పవార్‌కి ఫిర్యాదు చేయగా.. ఆయన తనను పదవి నుండి తప్పించారని వెంగ్‌సర్కార్ వాపోయారు.