లండన్: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్లో భాగంగా మాంచెస్టర్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ మూడో వికెట్‌ను కోల్పోయింది. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్ 67 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అప్పటికీ కివీస్ 35 ఓవర్లలో 133 పరుగులు చేసింది. న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయడంలో భారత బౌలర్లు తమ వంతు కృషిచేస్తున్నారు. ఈ కారణంగానే కివీస్ ఆటగాళ్ల జట్టు మొత్తం స్కోర్ 100 పరుగుల మైలురాయిని అందుకోవడానికి మొత్తం 28.1 ఓవర్లు శ్రమించాల్సి వచ్చింది. అంతకన్నా ముందుగా 19 ఓవర్‌‌లో రవీంద్ర జడేజా వేసిన  2వ బంతికి హెన్రీ నికోల్స్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోర్ 69/2 గా ఉంది. 


అంతకన్నా ముందు 3వ ఓవర్‌లో జస్ప్రిత్ బుమ్రా విసిరిన మూడో బంతికి మార్టిన్ గుప్తిల్ 1 పరుగుకే పెవిలియన్ బాటపట్టాడు. జస్ప్రిత్ బుమ్రా విసిరిన బంతిని మార్టిన్ హిట్ ఇవ్వగా.. ఆ వెనకాలే వున్న విరాట్ కోహ్లీ డైవ్ చేసి క్యాచ్ పట్టుకోవడంతో ఆరంభంలోనే టీమిండియాకు శుభారంభం లభించినట్టయింది. కివీస్ ఆటగాళ్లు ఒక పరుగు రాబట్టడానికి 17 బంతులు ఆడాల్సి వచ్చిందంటే.. భారత బౌలర్లు కివిస్ బ్యాట్స్‌మెన్‌కి ఎంత అగ్నిపరీక్ష పెడుతున్నారో ఇట్టే అర్థమైపోతుంది.