బర్త్ డే రోజున పుల్లెల గోపిచంద్ బయోపిక్ పై ప్రకటన
ఇటీవల బయోపిక్ సినిమాల హవా నడుస్తోంది. ప్రేక్షకులు కూడా వాటికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇదివరకే తెలుగులో ఎన్నో బయోపిక్ సినిమాలు వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి కూడా. వాటిలో అన్నమయ్య, రుద్రమదేవి, శ్రీరామదాసు, జగద్గురు ఆదిశంకర, తాండ్ర పాపారాయుడు, మహాకవి కాళిదాసు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో వచ్చాయి. తాజాగా ఎన్ఠీఆర్ మీద బయోపిక్ లు, సైరా నరసింహా రెడ్డి వస్తున్నాయి.
ఇక్కడివరకు బాగానే ఉంది కానీ టాలీవూడ్ లో క్రీడాకారులపై బయోపిక్ సినిమాలు లేవు. కానీ ఇప్పుడు ఆ లోటు భర్తీకానుంది. బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మీద ఇప్పటికే బయోపిక్ నిర్మిస్తుండగా, తాజాగా ఆయన గురువు పుల్లెల గోపీచంద్ మీద కూడా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.
టాప్ ప్రొడక్షన్ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రముఖ బ్యాట్మింటన్ కోచ్ గోపీచంద్ బర్త్ డే సందర్బంగా గురువారం గోపిచంద్ బయోపిక్ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలను వెల్లడించింది. ఈ బయోపిక్ లో గోపిచంద్ జీవిత విశేషాలు, కెరీర్ లో అతను పడిన కష్టాలు, అతనికి వరించిన బహుమతుల గురించి చూపించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
1973లో ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన పుల్లెల గోపీచంద్.. చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఆసక్తిని పెంచుకున్నాడు. అయితే అనూహ్యంగా బ్యాట్మింటన్ వైపు మళ్ళి బ్యాట్మింటన్ లో కీర్తి సంపాదించారు. 2001లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన గోపీచంద్ ఆ తరువాత కోచ్ గా మారి ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. వారిలో సైనా నెహ్వాల్, పివి సింధు కూడా ఉన్నారు. 2003లో హైదరాబాద్లో పుల్లెల గోపీచంద్ బ్యాట్మింటన్ అకాడమీ స్థాపించాడు.
సినిమా స్క్రిప్ట్ ఇంకా జరుగుతోందని, షూటింగ్ 2018 ఏడాది మధ్యలో మొదలవుతోందని వెల్లడించారు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు. ఇటీవల గరుడ వేగ తో హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో సుధీర్ బాబు కీలకపాత్ర పోషిస్తున్నాడు.