మాంచెస్టర్: భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య వర్షం కారణంగా ఆగిపోయిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన బుధవారం తిరిగి ప్రారంభం కానుంది. వర్షం కారణంగా ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో.. అక్కడి నుంచే బుధవారం తిరిగి ప్రారంభం కానుంది. మ్యాచ్ 46.1 ఓవర్ల వద్ద ఉండగా వర్షం కురియడంతో అంతటితో ఆటను నిలిపేసిన సంగతి తెలిసిందే. అప్పటికి న్యూజీలాండ్ 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. బుధవారం కూడా వానపడితే మెరుగైన రన్‌రేట్, పాయింట్ల కారణంగా భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. న్యూజీలాండ్ ఇంటి ముఖం పడుతుంది.


రిజర్వ్ డే రోజున ఒకవేళ మ్యాచ్ టై అయినట్టయితే, మ్యాచ్ చివరలో సూపర్ ఓవర్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. అలాకాకుండా ఒకవేళ వర్షం కారణంగా బుధవారం నాటి రిజర్వ్ డే మ్యాచ్ కూడా జరిగే అవకాశాలు లేక రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తితే, లీగ్ దశలో న్యూజిలాండ్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి, పాయింట్స్ పట్టికలో మెరుగైన స్థానం కలిగి వున్న టీమిండియాను ఫైనల్‌కు పంపుతారు. ఒకవేళ ఫైనల్ కూడా రద్దయితే, ప్రపంచ కప్ నిబంధనల ప్రకారం ఆ మ్యాచ్‌లో తలపడిన ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.