RCB vs RR match highlights: ముంబై: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో భాగంగా గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగిన 16వ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 10 వికెట్ల తేడాతో రాజస్థాన్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (101 నాటౌట్‌: 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు వేగంతో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. ఐపీఎల్‌లో పడిక్కల్‌కి ఇదే తొలి సెంచరీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు జాస్ బట్లర్ (8), మనన్ ఓహ్రా (7) సింగిల్ డిజిట్‌కే పరిమితం అవడంతో మొదలైన ఆ జట్టు తడబాటు చివరి వరకు కొనసాగింది. సంజూ శాంసన్ (21) తర్వాత మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన శివం దూబే (Shivam Dube 32 బంతుల్లో 46 పరుగులు 5 ఫోర్లు, 2 సిక్సులు), రాహుల్ తెవాటియా (Rahul Tewatia 23 బంతుల్లో 40 పరుగులు 4 ఫోర్లు, 2 సిక్సులు), రియాన్ పరాగ్(25) పరుగులు రాబట్టడంతో జట్టు ఆ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. 


అనంతరం 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండానే అలవోకగా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్‌తో (Devdutt Padikkal) పాటు విరాట్ కోహ్లీ (Virat Kohli 72: 47 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) చెలరేగిపోవడంతో మరో బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రావాల్సిన అవసరం లేకుండానే 10 వికెట్ల తేడాతో 16.3 ఓవర్లలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుపు సొంతం చేసుకుంది. 


ప్రస్తుతం జరుగుతున్న 14వ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి అంటే ఏంటో ఎరుగని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో (IPL 2021 points table) టాప్ ర్యాంకులో కొనసాగుతోంది.