న్యూజిలాండ్‌తో గ్రీన్ పార్క్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్‌ బ్యాట్స్‌మన్ తమ ప్రతాపాన్ని చూపించారు. రెచ్చిపోయి ఆడి కివీస్ ముందు ఆరు వికెట్ల నష్టానికి 338 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.  ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీ నమోదు చేసి (147) మరో రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఏడాది 1000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా వార్తల్లో నిలిచాడు.


అతని కంటే ముందు స్థానంలో మరో భారత్ బ్యాట్స్‌మన్ విరాట్‌ కోహ్లీ 1385 పరుగులతో తొలి స్థానాన్ని ఆక్రమించాడు. తన కెరీర్‌లో 169 వన్డేలు ఆడిన రోహిత్ మొత్తం 6157 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ పేరిట ఇదే రోజు వన్డేల్లో మొత్తం 9000 పరుగుల రికార్డు నమోదైంది. ఆ ఘనతను కూడా కోహ్లీ ఇదే మ్యాచ్‌లో సాధించడం విశేషం. ఈ ఘనత ద్వారా వన్డేల్లో 9000 పరుగులు చేసిన ఆరవ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. ఇదే రికార్డును మహేంద్ర సింగ్ ధోని గత సంవత్సరం సాధించాడు.