ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య టై అవడంతో ఐసిసి నిర్వాహకులు ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ సూపర్ ఓవర్‌లోనూ ఇరు జట్ల సమానంగా 15 పరుగులు చేసి మరోసారి టై అవడంతో బౌండరీ కౌంట్ అధికంగా ఉన్న ఇంగ్లండ్ జట్టును విశ్వ విజేతగా ఎంపిక చేయడంపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆటగాళ్లు, ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు, క్రికెట్ ఫ్యాన్స్ రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయమై టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఐసిసి పాటిస్తున్న పాత నిబంధనలపై ఓసారి దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్వీట్ చేశాడు. రోహిత్ శర్మ ట్వీట్ ప్రకారం ఆయన ఐసిసి తీరును తప్పుపట్టాడని ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.


అలాగే టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం బౌండరీ కౌంట్ ఆధారంగా విజేతను తేల్చే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంచేశాడు. అయితే, నిబంధనలను పాటించకతప్పదు కనుక ఇంగ్లండ్‌ని విజేత అని ఒప్పుకోక తప్పదని యూవి అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా చివరి వరకు పోరాడిన కివీస్ ఆటగాళ్లను చూస్తే గుండె తరుక్కుపోతుందని వారిపట్ల సానుభూతి వ్యక్తంచేశాడు.


బౌండరీ కౌంట్ ఆధారంగా విజేతను ఎంపిక చేయడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపి నేత గౌతం గంభీర్ సైతం ఏకిపారేశాడు. మ్యాచ్‌ను టైగా ప్రకటించాల్సింది అని అభిప్రాయపడిన గంభీర్... తాను రెండు జట్లకు అభినందనలు చెబుతున్నానంటూ ట్వీట్ చేశాడు.


ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పేరున్న క్రికెటర్స్ ఇంచుమించు ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తపర్చడం గమనార్హం.