నా రికార్డు బ్రేక్ చేస్తే కోహ్లీతో షాంపేన్ తాగుతా: సచిన్
సచిన్ కొహ్లీకి ఓ ప్రామిస్ చేశారు.
సచిన్ కొహ్లీకి ఓ ప్రామిస్ చేశారు. వన్డేల్లో తన 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తే కెప్టెన్ కొహ్లీతో కలిసి తాను కూడా షాంపేన్ తాగుతామని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పారు. క్రీడా పాత్రికేయుడు బోరియా మజుందార్ రచించిన ‘ఎలెవన్ గాడ్స్ అండ్ ఏ బిలియన్ ఇండియన్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ పైవిధంగా స్పందించారు.
ప్రస్తుతం వన్డేల్లో 35 సెంచరీలతో ఉన్న కొహ్లీ.. సచిన్ రికార్డును క్రాస్ చేసే అవకాశముంది. ఈ విషయంపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సచిన్ సమాధానమిచ్చాడు. ‘విరాట్ 50 సెంచరీలు కొడితే, 50 షాంపేన్ బాటిళ్లు అతడికి పంపుతారా’ అని ప్రశ్నించగా.. ‘విరాట్ నా రికార్డును బద్దలుగొడితే అతడికి షాంపేన్ బాటిల్స్ పంపను. నేనే వెళ్లి అతడితో కలిసి షాంపేన్ తాగుతా’ అని సచిన్ చెప్పి అక్కడున్న వారందరినీ నవ్వించారు. సచిన్ 45వ వడిలో అడుగుపెడుతున్న సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో.. కేక్ కటింగ్ ఏర్పాటుచేశారు. సచిన్ కేక్ కట్‌చేసి భార్య అంజలికి తినిపించారు.