టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఒకవేళ తనకు బిడ్డ పుడితే.. తన భర్త పేరుతో తన పేరు కలిసొచ్చేలా "మీర్జా మాలిక్" అని పేరు పెడతాను అని తెలిపారు. సానియా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడైతే సానియా దంపతులు తమ తొలిబిడ్డకు సంబంధించి త్వరలోనే శుభవార్త చెబుతామని పోస్టు చేశారో.. వెంటనే వారి అభిమానుల నుండి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే తనకు పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అయితే బాగుంటుందని ఇప్పటికే సానియా స్పష్టం చేశారు. అలాగని అబ్బాయి అయినా కూడా ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు. సానియా తనకు వివాహం అయినప్పుడు కూడా తన ఇంటిపేరును మార్చుకోనని.. మీర్జా అనే సర్ నేమ్ అలాగే కొనసాగిస్తానని చెప్పారు.


సానియా మీర్జా ఓ టెన్నిస్ స్టార్‌గా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో ఒకానొక సందర్భంలో మహిళల డబుల్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కూడా ఆమె కైవసం చేసుకున్నారు. తొలుత సింగిల్స్‌తోటే తన కెరీర్ మొదలుపెట్టినా ఆ తర్వాత డబుల్స్, మిక్సడ్ డబుల్స్ కూడా ఆడారు. డబుల్స్‌లో ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు వింబుల్డన్, యూఎస్ ఓపెన్ కూడా కైవసం చేసుకున్నారు.


అలాగే మిక్సడ్ డబుల్స్‌లో కూడా ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచి ఓపెన్, యూఎస్ ఓపెన్ గెలుచుకున్నారు. సానియా తనకు పుట్టబోయే బిడ్డ గురించి ట్విటర్‌లో హింట్ ఇవ్వగానే షోయబ్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. తన మొదటి బిడ్డకు 'మీర్జా మాలిక్' అని పేరు పెట్టడంలో అభ్యంతరం లేదని తెలియజేశారు.