జకార్తా వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఆసియా క్రీడల్లో భారత్‌ ముచ్చటగా  మూడో రోజు కూడా పతకాల వేటలో తన శైలిలో రాణిస్తోంది. భారత్ మూడోసారి రజత పతకం దక్కించుకున్నా..ఆ పతకం కూడా షూటింగ్‌లోనే రావడం గమనార్హం. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ విభాగంలో భారత క్రీడాకారుడు సంజీవ్‌ రాజ్‌పుత్‌ రజత పతకాన్ని దక్కించుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే పోటీలో చైనా షూటర్ హౌ జీచెంగ్ 453.3 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. సంజీవ్ మాత్రం 452.7 పాయింట్లతో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈసారి ఆసియన్ గేమ్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు మొత్తం 8 పతకాలను దక్కించుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. ఈ సారి ఆసియా క్రీడల్లో భారత్ తరఫున దాదాపు 500లకు పైగా క్రీడాకారులు బరిలోకి దిగారు. 


ఈసారి షూటింగ్‌లో రజత పతకం గెలుచుకున్న సంజయ్ రాజ్‌పుత్ హర్యానాలో జన్మించారు. ఆయనకు 37 ఏళ్లు. 2011లో జరిగిన ఐఎస్ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో ఆయన  షూటింగ్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 2016లో కూడా ఇదే ప్రపంచ కప్‌లో రాజపుత్ రజత పతకం గెలుచుకున్నారు. అలాగే 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్‌లో రజత పతకం గెలుచుకున్న రాజపుత్, 2018 కామన్వెల్త్ క్రీడల్లో కూడా స్వర్ఱ పతకం గెలుచుకున్నారు. అలాగే 2010లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడు స్వర్ణ పతకాలు కూడా దక్కించుకున్న ఘనత కూడా సంజయ్ రాజపుత్‌దే కావడం విశేషం.