DC Vs RR: `నో బాల్` కోసం పంత్ `పంతం`.. చివరి ఓవర్‌లో హైడ్రామా... గల్లీ క్రికెట్‌ను తలపించిన ఐపీఎల్ మ్యాచ్...
IPL DC Vs RR Updates: ఢిల్లీ-రాజస్తాన్ మ్యాచ్‌లో చివరి ఓవర్ హైడ్రామా నడుమ ముగిసింది. నో బాల్ విషయంలో తలెత్తిన వివాదంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది.
IPL DC Vs RR Updates: ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 22) ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్‌లో హైడ్రామా నడిచింది. ఢిల్లీ సారథి రిషబ్ పంత్ వ్యవహరించిన తీరు గల్లీ క్రికెట్‌ను తలపించింది. చివరి ఓవర్‌లో 'నో బాల్' విషయంలో పంత్ పంతానికి పోవడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. ఆ తర్వాత ఎట్టకేలకు బౌలర్ మెక్కాయ్ చివరి ఓవర్ పూర్తి చేయగా... ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
మ్యాచ్ 19 ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 6 బంతుల్లో 36 పరుగులు అవసరమయ్యాయి. రాజస్తాన్ బౌలర్ ఒబెడ్ మెక్కాయ్ వేసిన ఆ ఓవర్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మ్యాన్ రోవ్‌మన్ పావెల్ వరుసగా 3 బంతుల్లో 3 సిక్సర్లు బాదాడు. పావెల్ ఊపు చూస్తుంటే మరో 3 సిక్సులు బాది ఢిల్లీని విజయ తీరాలకు చేరుస్తాడా అన్న ఆశలు ఆ జట్టులో చిగురించాయి. అయితే మెక్కాయ్ వేసిన మూడో బంతి నడుము భాగానికి కాస్త పైకి రావడంతో.. దాన్ని 'నో బాల్'గా ప్రకటించాలని ఢిల్లీ జట్టు పేచీకి దిగింది.
మొదట బ్యాట్స్‌మెన్ రోవ్‌మన్ పావెల్, కుల్దీప్ యాదవ్... ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాలని ఫీల్డ్ అంపైర్‌ను కోరారు. అయితే అంపైర్ అందుకు ఒప్పుకోలేదు. అదే సమయంలో డగౌట్‌లో ఉన్న ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్... క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి రావాల్సిందిగా చేతులతో సైగలు చేశాడు. ఆ సమయంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బట్లర్ పంత్ వద్దకు వెళ్లడంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాలతో మ్యాచ్‌లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
నో బాల్‌ని థర్డ్ అంపైర్ ద్వారా రివ్యూ చేయాలని పంత్ పట్టుబడ్డాడు. అయితే నిబంధనల ప్రకారం ఔట్ అయిన బంతులకే రీప్లే చూస్తారు. దీంతో నో బాల్ రివ్యూ కుదరదని తేల్చేశారు. చివరికి చేసేది లేక ఢిల్లీ బ్యాటింగ్ కొనసాగించింది. చివరి 3 బంతుల్లో ఆ జట్టు 2 పరుగులే చేయడంతో 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
కాగా, 'నో బాల్' వివాదంపై ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ రిషబ్ పంత్‌తో విబేధించడం గమనార్హం. అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ వ్యవహారంపై ట్విట్టర్‌లో పంత్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. పంత్ దీన్ని గల్లీ క్రికెట్ అనుకున్నాడా... ఇలా చేశాడేంటని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరోవైపు, అది నిజంగానే 'నో బాల్' అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.
Also Read: Horoscope Today April 23 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు 'రియల్ ఎస్టేట్'కు దూరంగా ఉంటే మంచిది..
Hyderabd: దారుణం.. అక్షింతలు వేస్తానని చెప్పి.. మహిళ తలపై ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన పూజారి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.