ఓవల్: ప్రపంచ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన 14వ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 6 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 117 పరుగులు (109 బంతుల్లో 4x16), కెప్టెన్ విరాట్ కోహ్లీ 82 పరుగులు (77 బంతుల్లో 4x4, 6x2), రోహిత్ శర్మ 57 పరుగులు(70 బంతుల్లో 4x3, 6x1), హార్దిక్ పాండ్య 48 పరుగులు(27 బంతుల్లో 4x3, 3x6) చెలరేగి ఆడగా ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ధోని 14 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు రాబట్టాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా352 పరుగులు చేసింది. 


అనంతరం 353 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 316 పరుగులకే చాపచుట్టేసింది. తొలుత ఓపెనర్లు కుదురుగానే ఆడినప్పటికీ మిడిల్ అర్డర్  మాత్రం భారత బౌలర్ల దెబ్బకి క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో ఒకనొక దశలో ఆసిస్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఫలితంగా 36 పరుగుల తేడాతో ఆసిస్‌ఫై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికాతో గెలుపు తర్వాత వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది భారత్.