శ్రేయాస్ అయ్యర్‌ని వరించనున్న విరాట్ కోహ్లీ స్థానం !
విరాట్ కోహ్లీ స్థానంలో టీమిండియా జట్టులోకి రానున్న శ్రేయాస్ అయ్యర్
టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌కి దూరం కానున్న నేపథ్యంలో అతడి స్థానంలో జట్టులోకి యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కి చోటు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. కౌంటీ క్రికెట్ ఆడేందుకు కోహ్లి ఇంగ్లండ్ వెళ్లనున్న నేపథ్యంలో కోహ్లి అఫ్గాన్‌తో జరిగే ఎకైక టెస్టుతోపాటు ఐర్లాండ్ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ పేరును బీసీసీఐ సెలక్షన్ కమిటీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆఫ్గనిస్తాన్ టెస్టు కోసం జట్టుని ఎంపిక చేసే ప్రయత్నంలో భాగంగా మంగళవారం సెలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలోనే సెలక్షన్ కమిటీ శ్రేయాస్ అయ్యర్‌కి కోహ్లీ స్థానంలో చోటు కల్పించే అవకాశం వుందని తెలుస్తోంది. ఒకవేళ అదే కానీ జరిగితే, శ్రేయాస్ అయ్యర్‌కి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఆడే అవకాశం సొంతం చేసుకున్నట్టేనని భావించొచ్చు.
ఆఫ్గనిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి బదులుగా వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇదిలావుంటే, ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌కు రోహిత్ శర్మ జట్టు కెప్టేన్‌గా వ్యవహరించే అవకాశాలు వున్నాయి. బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న చటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ ఆఫ్గనిస్తాన్ టెస్టుకు అందుబాటులో ఉండనున్నారు.