సౌతాంప్టన్ టెస్ట్: 3-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని చవిచూసింది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య సౌతాంప్టన్‌లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. భారత్ జట్టు 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 273 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పరుగుల లక్ష్యచేధనలో విరాట్ 58 పరుగులు, రహానే 51 పరుగులతో రాణించినా.. ఓపెనర్లతో పాటు మిడిలార్డర్ చేతులెత్తేయడంతో భారత జట్టు 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
దీంతో భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో 3-1తేడాతో ఇంగ్లండ్ జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి టెస్ట్ మ్యాచ్ ఈనెల 7వతేదీన లార్డ్స్ మైదానంలో జరుగనుంది.
ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు బౌలర్ మొయిన్ అలీ మొదటి, రెండో ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 9 వికెట్లు తీయడంతో పాటు మొదటి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టు విజయానికి దోహదపడినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
అటు టెస్టుల్లో 4 వేల పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అలాగే ఒకే సిరీస్‌లో 500 కన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి భారత్ కెప్టెన్‌గా నిలిచాడు.
బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం: కోహ్లీ
సౌతాంప్టన్ టెస్టులో ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమే అని టీమిండియా కెప్టెన్ కోహ్లీ అన్నాడు. గెలిచే అవకాశాలు ఉన్నా బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారన్న కోహ్లీ.. ఇంగ్లాండ్ జట్టు విజయానికి పూర్తి అర్హమైనదిగా పేర్కొన్నాడు. ఇంగ్లండ్ యువ ఆటగాడు సామ్ కుర్రన్‌ను కోహ్లీ అభినందించాడు.