Wanindu Hasaranga Retires From Test Cricket: శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు వెల్లడించాడు. వైట్ బాల్‌ క్రికెట్‌పై మరింత దృష్టిపెట్టేందుకు హసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలకం క్రికెట్ బోర్డు ధృవీకరించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ ఆష్లే డి సిల్వా మాట్లాడుతూ.. తాము హసరంగా నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం తమకు ఉందని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26 ఏళ్ల హసరంగా తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతను 4 వికెట్లు పడగొట్టాడు. డిసెంబర్ 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2021 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌తో చివరి టెస్టు ఆడాడు. టెస్టుల్లో హసరంగ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. అయితే ఆడింది నాలుగే టెస్టుల్లో కాబట్టి.. భవిష్యత్‌లో శ్రీలంకకు అన్ని ఫార్మాట్లలో కీ బౌలర్‌గా మారతాడని అందరూ అనుకున్నారు. అయితే ఇలా అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. 


రెడ్ బాల్ క్రికెట్‌లో సత్తా చాటులేకపోయిన వనిందు హసరంగా.. వన్డే, టీ20ల్లో మాత్ర అదరగొడుతున్నాడు. టీ20ల్లో నంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం టీ20ల్లో మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 58 టీ20 మ్యాచ్‌ల్లో హసరంగా 15.8 సగటుతో 91 వికెట్లు పడగొట్టాడు. కేవలం 6.89 ఎకానమీతో పరుగులు ఇవ్వడం విశేషం. సెప్టెంబర్ 2019లో న్యూజిలాండ్‌పై టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 


వన్డేల్లోనూ హసరంగా తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జూలై 2017లో వన్డేల్లో అరంగేట్రం చేసిన హసరంగా.. ఇప్పటివరకు 48 మ్యాచ్‌ల్లో 28.78 సగటుతో 67 వికెట్లు పడగొట్టాడు. అతను 5.08 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఇటీవల ఐసీసీ వరల్డ్‌ కప్‌కు శ్రీలంక అర్హత సాధించడంలో హసరంగా కీలక పాత్ర పోషించాడు. 22 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.