టీమిండియా పురుషుల జట్టు కోచ్‌గా మిథాలి రాజ్ : షారుఖ్ ఖాన్
సాధ్యమైనంత వరకు తాను మంచి ఫలితాలని ఇవ్వడానికే కృషిచేస్తాను : మిథాలి రాజ్
టీమిండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ టీమిండియా పురుషుల జట్టుకి కోచ్‌గా వ్యవహరిస్తే చూడాలని వుందని అన్నాడు షారుఖ్ ఖాన్. జనవరి 1న జరిగిన 'టెడ్ టాక్స్ ఇండియా నయీ సోచ్' కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మిథాలి రాజ్‌తో మాట్లాడిన సందర్భంలో ఆమెని ప్రశంసల్లో ముంచెత్తిన షారుఖ్.. మిథాలిని ఏదో ఓ రోజు టీమిండియా పురుషుల జట్టుకు కోచ్‌గా చూడాలని వుందని ఆశిస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు.
షారుఖ్ ఖాన్ మాటలకు స్పందించిన మిథాలి రాజ్.. 'సాధ్యమైనంత వరకు తాను మంచి ఫలితాలని ఇవ్వడానికే కృషిచేస్తాను' అని అన్నారు. 'మైదానంలో వున్నప్పుడు అందరి దృష్టి ప్లేయర్స్ ఆడే ఆటపైనే వుంటుంది. అంతేకాకుండా చేజారిని కప్పుని మళ్లీ ప్లేయర్స్ తీసుకువస్తారనే అందరూ ఆశిస్తారు కనుక మైదానంలో వున్నంతసేపు ఎవరైనా సరే శ్రద్ధగానే వ్యవహరిస్తారు' అని చెప్పుకొచ్చారామె.
క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ముందు పుస్తకాలు చదివే అలవాటుకి కారణం ఏంటి అని షారుఖ్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఈ టీమిండియా మహిళల జట్టు స్కిప్పర్.. ' మైదానంలో ఆట ఆడే సమయంలో ఒత్తిడిని అధిగమించి, ప్రశాంతంగా వుండటం కోసమే తాను మ్యాచ్‌కి ముందు పుస్తకాలు చదువుతాను' అని వివరించారు. గతంలో ఓసారి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనూ ఆమె పుస్తకం చదువుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మిథాలి రాజ్ పాల్గొన్న ' టెడ్ టాక్స్ ఇండియా నయీ సోచ్ ' 2018, జనవరి 7వ తేదీన స్టార్ ప్లస్‌లో ప్రసారం కానుంది.
ఇక 35 ఏళ్ల మిథాలి కెరీర్ విషయానికొస్తే, రెండుసార్లు (2005, 2017) తన జట్టుని వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేర్చిన మొదటి ఇండియన్ స్కిప్పర్ (పురుషులు, మహిళల జట్లు రెండింటిలోనూ ఆమెదే రికార్డ్) గా మిథాలి రాజ్ రికార్డ్ సొంతం చేసుకోవడం విశేషం.