టీమిండియా మాజీ ఆటగాడు, తమిళనాడు బ్యాట్స్‌మన్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌ క్రికెట్‌‌కి గుడ్ బై చెప్పారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్టు బద్రినాథ్ శుక్రవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. తమిళనాడు జట్టు ఆటగాడు బాలాజీ, తన తండ్రితో కలిసి మీడియాతో మాట్లాడుతూ బద్రినాథ్ ఈ ప్రకటన చేశారు. గత ఏడాదిన్నర కాలంగా దేశవాలి క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతోపాటు తనకు నిన్న(గురువారం)నే 38 ఏళ్లు నిండాయని, అందుకే ఇక క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అనిపించిందని బద్రినాథ్ అన్నారు. గత ఏడాది కాలంగా క్రికెట్‌కి వీడ్కోలు పలకాలి అని అనుకుంటున్నప్పటికీ ఆ నిర్ణయం ఇవాళ ఫైనల్ అయిందని చెబుతూ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నందుకు బద్రినాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. 


తమిళనాడుకు చెందిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌ భారత్ తరపున రెండు టెస్ట్‌లు, ఏడు వన్డేలు, ఒక టీ-20లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా తరపున బద్రినాథ్ చివరి మ్యాచ్ ఆడి ఏడేళ్లవుతోంది. అలా టీమిండియా జట్టులోనూ బద్రినాథ్ మాజీ సభ్యుడయ్యారు. రంజీల్లో హైదరాబాద్‌, విదర్భలకు సైతం ప్రాతినిధ్యం వహించిన బద్రినాథ్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున మ్యాచెస్ ఆడారు. బద్రినాథ్ ఆడిన 145 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 54.49 సగటుతో 10,245 పరుగులు చేయగా అందులో 32 సెంచరీలు ఉన్నాయి. తన కెరీర్ లో 2010-11 సీజన్ అత్యుత్తమమైనదిగా పేర్కొన్న బద్రినాథ్.. ఆ సీజన్‌లోనే అధిక సెంచరీలు చేసినట్టు తెలిపారు.