ధోనీ రిటైర్మెంట్‌పై సునీల్ గవాస్కర్ కామెంట్స్
ధోనీ రిటైర్మెంట్‌పై సునీల్ గవాస్కర్ కామెంట్స్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై సీనియర్ లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి ఉద్వాసన పలకాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించకముందే.. అతనే గౌరవంగా పక్కకు తప్పుకుంటే బాగుంటుందని గవాస్కర్ సూచించాడు. ''ధోనీకి ఉన్న లక్షలాది మంది అభిమానుల్లో నేనూ ఒకడిని కనుకే అతడి మీద ఉన్న గౌరవంతో చెబుతున్నా.. ఇక ధోనీ టైమ్ అయిపోయింది. అతడు ఏం చెబుతాడనే నిర్ణయం కోసం మేనేజ్‌మెంట్ వేచిచూస్తోంది. రానున్న టీ-20 ప్రపంచ కప్ సమయానికి ధోనీ వయసు 39 ఏళ్లు. ఆ వయసులో క్రికెట్ ఆడటం కష్టమే అవుతుంది. అందుకే ధోనీయే ముందుగా తప్పుకుంటే మంచిది. మేనేజ్‌మెంట్ ధోనీని పొమ్మని చెప్పకముందే అతడే గౌరవంగా వీడ్కోలు చెబుతాడని ఆశిస్తున్నా'' అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో ధోని రిటైర్మెంట్ అంశం గురించి ప్రస్తావనకు రాగా సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై దిగ్గజ క్రికెటర్స్ స్పందించడం ఇదేం మొదటిసారి కాదు. ఇదే విషయమై ఇటీవల అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. ధోనీ భవితవ్యం ఏంటనే విషయమై బీసీసీఐ వీలైనంత త్వరలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. ధోనీ లాంటి గొప్ప ఆటగాడికి గొప్ప వీడ్కోలు లభించాల్సిన అవసరం ఉంది కానీ ఇలా ఊగిసలాటల మధ్య అతడి కెరీర్ సాగకూడదంటూ కుంబ్లే చేసిన కామెంట్స్ అప్పట్లో చర్చనియాంశమైన సంగతి తెలిసిందే.