వెస్టిండీస్ వేదికగా నిర్వహిస్తోన్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ సరికొత్త రికార్డు నమోదైంది. పాకిస్థాన్ పేస్‌బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ టీ20ల్లో అతి తక్కువ పరుగులిచ్చిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఆడిన ఇర్ఫాన్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ బ్యాట్స్‌మన్‌ను తన బౌలింగ్‌తో బాగా కట్టడి చేశాడు. వరుసగా 23 బంతులు వేసిన ఇర్ఫాన్.. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ కనీసం ఒక్క పరుగు కూడా చేయడానికి అవకాశమివ్వకపోవడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే నాలుగు ఓవర్లు ముగిసేసరికి.. ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు ఈ యువ బౌలర్. అయితే ఇంత బాగా బౌలింగ్ చేసినా సరే.. తన జట్టు ఓటమిని అడ్డుకోలేకపోయాడు ఇర్ఫాన్. ఈ మ్యాచ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయినా క్రికెట్ అభిమానులు ఇర్ఫాన్‌కి బ్రహ్మరథం పట్టారు. ఈ మ్యాచ్‌లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు కూడా ఇర్ఫాన్‌కే దక్కడం విశేషం.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ ట్రైడెంట్స్ 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ జేస్ హోల్డర్ 45 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగిన సెయింట్స్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు మాత్రం తొలుత కాస్త తడబడినా.. ఆ తర్వాత బాగానే పుంజుకుంది.  18.5 ఓవర్లలోనే గేమ్ పూర్తిచేసింది. బ్రాండన్ కింగ్ 49 బంతుల్లో 60 పరుగులు చేసి ఈ జట్టు విజయంలో ప్రధానమైన పాత్ర పోషించాడు.