కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చరిత్రలో భారత్ తన సత్తా చాటింది. భారత క్రీడాకారిణులు మానికా బత్రా, మాధురికా పట్కార్‌, మోమా దాస్, సుత్రితా ముఖర్జీ, పూజా సహస్రబుద్ధి ఫైనల్ ఆటలో రాణించి 3-1 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్స్ సింగపూర్‌ను మట్టికరిపించి టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని గెలచుకున్నారు.  తద్వారా కామన్వెల్త్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్ విభాగంలో మనదేశానికి తొలి పతకం తీసుకొచ్చారు.


ఈ స్వర్ణంతో ప్రస్తుతం భారత్ ఖాతాలో 12 పతకాలు చేరగా.. అందులో 7 స్వర్ణాలే ఉండడం గమనార్హం. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఇండియన్ అమ్మాయిలు ప్రత్యర్థి దేశాల అమ్మాయిలైన యే లిన్, వాంలింగ్ జింగ్, తైన్వే ఫెంగ్, మెంగ్యు యూ, యిహాన్ జో తదితరులను ఖంగు తినిపించారు. ఇప్పటికి వరకు కామన్వెల్త్ ఆటలకు సంబంధించి సింగపూర్ తిరుగులేని ఛాంపియన్‌గా ఉంది. ఆ సంప్రదాయానికి భారత క్రీడాకారిణులు స్వస్తి పలికారు. తమ సత్తా చూపించి చరిత్రను తిరగరాశారు