టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు దేశీయ, అంతర్జాతీయ క్రికెటర్ల జీతభత్యాలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ సూచనల ప్రకారం బీసీసీఐ క్రీడాకారుల వేతనాలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం బీసీసీఐ ఆదాయంలోని 26% రెవెన్యూ అంతర్జాతీయ క్రికెటర్లు, స్వదేశీ క్రికెటర్లు, మహిళా క్రికెటర్లు మరియు జూనియర్ క్రికెటర్ల మధ్య విభజించే అవకాశం ఉంది. అందులో 13% ఆదాయాన్ని అంతర్జాతీయ క్రికెటర్ల వేతనానికి, 10.6% ఆదాయాన్ని స్వదేశీ క్రీడాకారుల వేతనానికి, 2.4% ఆదాయాన్ని మహిళా క్రికెటర్లు మరియు జూనియర్ల వేతనానికి వెచ్చించనున్నారు.


ముఖ్యంగా, టీమిండియా రథసారథి విరాట్ కోహ్లీ వేతనం కూడా భారీ స్థాయిలో పెరగనుందని సమాచారం. ప్రస్తుతం ఆయన 2017 సంవత్సారానికి గాను 47 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 5.51 కోట్లు సంపాదించగా... తాజా ఉత్తర్వుల ప్రకారం ఆయన వేతనం 10 కోట్ల రూపాయలకు పెంచనున్నారని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం రంజీ ఆటగాళ్ళకు ఇస్తున్న 12 లక్షల వేతనాన్ని 30 లక్షల వరకు పెంచనున్నారని తెలుస్తోంది. గతంలో క్రికెటర్ల జీతాలు పెంచాలనే డిమాండ్‌ను సౌరవ్ గంగూలీ లాంటి వారు వ్యక్తపరిచారు.