దుర్గాపూజ కోసం.. పగటి వేషం వేసిన క్రికెటర్..!
ఆ క్రికెటర్ అప్పటికే భారత జట్టుకి కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గల్లీ క్రికెట్ ఆడేటప్పటి కంటే.. కెప్టెన్ అయ్యాక అతనికి అభిమానులు లెక్కలేనంత మంది పెరిగారు.
ఆ క్రికెటర్ అప్పటికే భారత జట్టుకి కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గల్లీ క్రికెట్ ఆడేటప్పటి కంటే.. కెప్టెన్ అయ్యాక అతనికి అభిమానులు లెక్కలేనంత మంది పెరిగారు. బయటకు వస్తే చాలు ఆటోగ్రాఫులు.. ఫోటోలు అంటూ వెంటపడే వారి నుండి తప్పించుకోవడానికి అతను తెగ ప్రయత్నించేవాడు. ఎప్పుడూ సెక్యూరిటీ లేకుండా బయటకి వచ్చేవాడు కాదు. అయితే అలా సెక్యూరిటీతో బయటకు రావడం తనకు ఇబ్బందిగా ఉండేది.
చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడం కూడా అయ్యేది కాదు. అదే కాలేజీ రోజులలో అయితే.. స్నేహితులతో కలిసి ఎంచక్కా నవరాత్రుల్లో డ్యాన్స్ చేసేవాడు. అయితే ఇప్పుడు అది కుదరదు కదా.. అందుకే సర్దార్జీ వేషం వేసుకున్నాడు. బాగా పరికించి చూస్తే తప్ప తనను ఎవరూ గుర్తుపట్టనంత మేకప్ వేసుకొని ఉత్సవానికి వెళ్లాడు. అయితే ఈ విషయం తెలిసిన ఆయన స్నేహితులు, బంధువులు "నువ్వు కచ్చితంగా దొరికిపోతావు" అని నవ్వుతూ చెప్పారట.
ఈ పగటి వేషంతో కారులో బయలుదేరిన ఆ క్రికెటర్‌ని సామాన్యులు ఎవరూ గుర్తుపట్టకపోయినా.. పోలీసులు మాత్రం కనిపెట్టేశారట. అయితే నవ్వుతూ విడిచిపెట్టారట. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ఆయనే సౌరభ్ గంగూలీ. ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్‌కి రథసారథిగా సేవలందించిన వ్యక్తి. ఇటీవలే ఆయన తన స్వీయ చరిత్ర ఆధారంగా రాసిన "ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్" అనే పుస్తకంలో ఈ సంఘటనను ప్రస్తావించారు.