ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి ఇద్దరు భారతీయ అథ్లెట్లపై వేటు వేస్తున్నట్టు కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకటించింది. కామన్‌వెల్త్ గేమ్స్ స్పూర్తికి విరుద్ధంగా 'నో నీడిల్ పాలసీ'ని ఉల్లంఘించిన నేరం కింద వారిని కామన్‌వెల్త్ గేమ్స్ విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఆదేశించింది. రేస్ వాకర్ కేటీ ఇర్ఫాన్, ట్రిపుల్ జంపర్ రాకేష్ బాబు వుంటున్న గదుల్లో సిరంజి, సూదులు లభించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఈ ఆదేశాలు జారీచేసింది. రాకేష్ బాబు, కేటీ ఇర్ఫాన్‌లకు కేటాయించిన బెడ్ రూమ్స్‌లో సిరంజి, సూదులు లభించాయని, అనంతరం జరిగిన ప్రాథమిక విచారణలో ఆ ఇద్దరూ వివరణ ఇవ్వడంలో విఫలం అయినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇర్ఫాన్ కొలొతుం తోడి బెడ్ రూమ్‌లోని కప్‌లో ఇంజక్షన్ సూది లభించగా, రాకేష్ బాబు బెడ్ రూమ్‌లో అతడి లగేజీ బ్యాగులో సిరంజీ లభించింది. ఇదే విషయమై ఆ ఇద్దరినీ వివరణ కోరగా.. వాటి గురించి తమకు ఏమీ తెలియదని చెప్పడం విడ్డూరంగా వుంది అంటూ కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ విస్మయం వ్యక్తంచేసింది.


నో నీడిల్ పాలసీ ప్రకారం కామన్‌వెల్త్ గేమ్స్ పోటీల్లో పాల్గొనే వారు కానీ అందుకు సంబంధించిన వారి వద్ద కానీ సిరంజీలు, సూదులు వంటివి ఏవీ కలిగి వుండరాదు. అలా కాకుండా సిరంజి, సూదులు వెంట తీసుకెళ్లినట్టయితే, అది నో నీడిల్ పాలసీని ఉల్లంఘించడమే అవుతుంది. కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ నియమ నిబంధనలని ఉల్లంఘించిన వారిపై పోటీల్లో పాల్గొనే అర్హత లేకుండా వేటు వేసే అధికారం కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్‌కి వుంటుంది.