నొవాక్‌ జొకోవిచ్‌(సెర్బియా) మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ డెల్‌ ప్రోటోపై 6-3, 7-6,(7/4), 6-3తో తేడాతో జకోవిచ్ ఘనవిజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌ ఆద్యంతం జొకోవిచ్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తూ.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కెరీర్‌లో జకోవిచ్‌కిది 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ గ్రాండ్‌స్లామ్‌ తన ఖాతాలో వేసుకొని పీట్‌ సంప్రాస్‌ సరసన చేరాడు. ఈ జాబితాలో రోజర్ ఫెదరర్ (20), రఫెల్‌ నాదల్‌ (17)మాత్రమే తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.


ఏడాది క్రితం రఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న వేళ గాయం కారణంగా సెర్బియన్ నొవాక్‌ జొకోవిచ్‌ ఇంట్లో ఉన్నాడు. సంవత్సరం తిరిగేలోపు సీన్ రివర్స్ అయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నాదల్‌ మాజీ విజేత డెల్‌పొట్రోతో జరిగిన సెమీఫైనల్లో మోకాలి నొప్పితో మధ్యలోనే వైదొలగగా... పూర్తి ఫిట్‌నెస్‌‌తో ఉన్న  జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.