లండన్: ప్రపంచ కప్‌కి సిద్ధమవుతున్న వేళ టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడి కుడి చేతికి గాయమైంది. పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ వేసిన బంతిని ఎదుర్కునే క్రమంలో విజయ్ శంకర్‌ చేతికి దెబ్బ తగిలింది. దీంతో భరించలేని నొప్పితో విజయ్ శంకర్ ప్రాక్టీస్‌ని మధ్యలోనే వదిలేసి వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం టీమిండియా ఫిజియో పర్యవేక్షణలో వున్న విజయ్ శంకర్ పరిస్థితి ఏంటనేదానిపై ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. స్కానింగ్ చేస్తే కానీ విజయ్ శంకర్ గాయం తీవ్రత తెలిసే పరిస్థితి లేదని టీమిండియా ఫిజియో తెలిపారు. వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో టోర్నీలో జట్టు తరపున 4వ స్థానంలో రాణిస్తాడనుకున్న ఆల్ రౌండర్ విజయ్ శంకర్ చేతికి గాయమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆటలో అతడొక్కడే కీలకం అని భావించనప్పటికీ.. ఆటలో ఆల్ రౌండర్స్ భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదనే విషయాన్ని మాత్రం కొట్టిపారేయలేం కదా అంటున్నారు క్రీడా నిపుణులు. 


ఇదిలావుంటే, మరోవైపు ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న కేదార్‌ జాదవ్‌ కూడా రెండు రోజుల పాటు స్వల్పంగా ప్రాక్టీస్‌ చేశాడు. ప్రపంచ కప్‌కి తొలి సన్నాహక మ్యాచ్‌ల్లో భాగంగా నేడు ఓవల్ స్టేడియం వేదికగా జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుందనే విషయం తెలిసిందే.