కేరళ వరద బాధితులకు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల దాతృత్వం
కేరళ వరద బాధితుల పట్ల తమ దాతృత్వాన్ని చాటుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు
బాలీవుడ్, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కేరళ వరద బాధితుల పట్ల తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాలో విరుష్క దంపతులు కూడా చేరిపోయారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఆ దేశం జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం అక్కడే ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కేరళ వరద బాధితుల కోసం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని పంపించినట్టు తెలుస్తోంది. అయితే, విరుష్క దంపతులు పంపించిన చెక్కు మొత్తం ఎంత అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కేరళ బాధితుల గురించే కాకుండా వరదల బారినపడి, అల్లాడుతున్న నోరు లేని మూగజీవాల కోసం సైతం విరుష్క దంపతులు ఆలోచించారు. అందుకే వరద బాధితులకు సహాయక సామాగ్రితోపాటు ఆహారం లేక విలవిల్లాడుతున్న మూగ జీవాల కోసం ఓ ట్రక్కు నిండా ఆహార వస్తువులు, ఔషధాలు పంపినట్టు మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి.
అనుష్క, విరాట్ కోహ్లీ దంపతులు ఇంగ్లండ్‌లో ఉంటూనే ఇక్కడ ఉన్న తమ సిబ్బందితో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ కేరళలోని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా సాధించిన విజయాన్ని కేరళ బాధితుల కోసం అంకితం చేస్తున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ ద్వారా రూ.1.26 కోట్ల ప్రైజ్ మనీని కేరళ వరద బాధితులకు విరాళంగా అందిస్తు్న్నట్టు స్పష్టంచేశాడు.