టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది కూడా విజ్డన్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. అవును, కోహ్లీ మరోసారి విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఇదిలావుంటే, కోహ్లీతోపాటు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టేన్ మిథాలీ రాజ్‌ సైతం వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సొంతం చేసుకుంది. టెస్ట్, వన్డే, టీ 20 ఇలా అన్నీ ఫార్మాట్లలో అత్యంత విజయవంతమైన ఇంటర్నేషనల్ క్రికెటర్‌ కేటగిరీ కింద ఈ అవార్డ్ కోహ్లీని వరించింది. అన్ని ఫార్మాట్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన విరాట్ కోహ్లీ.. 2818 పరుగులతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మొదటి స్థానం సొంతం చేసుకున్నాడు. ఇక మిథాలి రాజ్ విషయానికొస్తే, భారత మహిళల జట్టు మహిళల ప్రపంచ కప్ పోటీల్లో ఫైనల్స్ వరకు వెళ్లడంలో జట్టును ముందుండి నడిపించిన మిథాలీ రాజ్.. మహిళల విభాగంలో వన్డేల్లో ఆల్‌టైమ్ లీడింగ్ రన్-స్కోరర్‌గా నిలిచింది. ఏడాది క్రితమే ఈ రికార్డు సొంతం చేసుకున్న మిథాలి రాజ్‌ ప్రతిభను గుర్తిస్తూ ఇప్పుడీ అవార్డ్ వరించింది.


తాజాగా ప్రకటించిన విజ్డన్ అవార్డ్ విన్నర్స్ జాబితాలో మొత్తం ఐదుగురు ఆటగాళ్లు వున్నారు. ఆ ఐదుగురిలో ఒకరు విరాట్ కోహ్లీ, మరొకరు మిథాలి రాజ్ కాగా.. వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లాండ్ వుమెన్స్ జట్టులో ముగ్గురు క్రీడాకారిణులైన అన్యా శ్రుబోస్లే, కెప్టెన్ హీదర్ నైట్, ఆల్‌రౌండర్ నటాలీ సీవెర్‌ మిగతా ముగ్గురు ఆటగాళ్ల జాబితాలో వున్నారు. 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడంలో ఈ ముగ్గురూ కీలక పాత్ర పోషించారు.