దెబ్బకు దెబ్బ: మూడో టెస్టులో కోహ్లీసేన భారీ విజయం.. లార్డ్స్ టెస్టు ఓటమికి ప్రతీకారం
కోహ్లీ సేన మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇంగ్లాండ్ టూర్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
కోహ్లీ సేన మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇంగ్లాండ్ టూర్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుపై 203 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. లార్డ్స్ టెస్టులో ఘోరంగా విఫలమమైన భారత సేన.. ఈ టెస్టులో మాత్రం బాగానే పుంజుకుంది. తద్వారా విమర్శకుల నోళ్లు మూయించేందుకు ప్రయత్నించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 2-1కి కోహ్లీ సేన తగ్గించడం జరిగింది. మూడో టెస్టులో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ చెప్పుకోదగ్గ విధంగానే రాణించింది.
ఈ టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ (97 పరుగులు), రహానే (81 పరుగులు), ధావన్ (35 పరుగులు) జట్టు స్కోరుకి మంచి పునాది వేశారు. 329/10 పరుగులు చేశారు. అయితే ఆ తర్వాత భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌కు మాత్రం నిజంగానే చుక్కెదురైంది. హార్దక్ పాండ్య 5 వికెట్లు తీసి ఆంగ్లేయులు నడ్డివిరిచాడు. ఇషాంత్, బుమ్రా కూడా చెరొక రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో అందరూ ఆలౌట్ అవ్వగా 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత్ చెలరేగి ఆడింది. కోహ్లీ (103 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. పుజారా (72 పరుగులు), ధావన్ (44 పరుగులు), హార్దిక్ పాండ్య (52) పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. తద్వారా 110.0 ఓవర్లలో 352/7 పరుగులు చేశారు. తర్వాత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ మళ్లీ తడబడ్డారు. జోస్ బట్లర్ (106) ఒక్కడే అలుపెరగని ధీరుడిలా పోరాడాడు. బెన్ స్టోక్స్ (62) కూడా కొంత వరకు స్కోరును ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు.
అయితే రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ మాయాజాలం భారత్ జట్టుకి బాగా కలిసొచ్చింది. 85 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన బూమ్రా ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇషాంత్ కూడా రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ కేవలం 317 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ టెస్టులో భారీ విజయం సాధించిన భారత జట్టులో విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అవార్డు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ ఈ జట్టు విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇచ్చారు. వారిని ఆదుకొనేందుకు టీమిండియా ముందుకు వస్తోందని అన్నారు.