కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో 75 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ కెరీర్‌లో మరో మైలురాయిని అధిగమించాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ (9,378), విండీస్‌ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్‌ (9,420) లను అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఓవరాల్‌గా కోహ్లీ 16వ స్థానంలో నిలవగా.. భారత్‌ తరపున ఐదో ఆటగాడిగా నిలిచాడు.


ఇప్పటికి 206 వన్డేలు ఆడిన కోహ్లీ 9,423 పరుగులు చేశాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 463 మ్యాచ్‌లు ఆడిన సచిన్‌ 49 సెంచరీలతో 18,426 పరుగులు సాధించాడు. తర్వాతి స్థానాల్లో సౌరవ్‌ గంగూలీ (11,363), రాహుల్‌ ద్రవిడ్‌ (10,889), ఎంఎస్‌ ధోనీ (9,954) ఉన్నారు. ఇప్పుడు కోహ్లీ ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.