ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌‌లో టీమిండియా కెప్టెన్ నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. ఆయన స్థానంలో ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 929 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండవ టెస్టులో కోహ్లీ 23, 17 వంటి చాలా తక్కువ స్కోర్లే చేయడంతో ఆ పరుగుల ప్రభావం ఆయన ర్యాంకింగ్ పై కూడా పడింది. రెండో టెస్టు మ్యాచ్‌ను టీమిండియా ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికీ తెలిసిన విషయమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2011లో సచిన్ టెండుల్కర్ నెంబర్ వన్ టెస్టు బ్యాట్స్‌మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాక.. ఆ తర్వాత కోహ్లీ ఒక్కడే చాలా తక్కువ సమయంలో ఆ స్థానానికి చేరుకున్నాడు. కానీ ఆయన దానిని నిలబెట్టుకోలేకపోయాడని క్రీడా వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం బాల్ ట్యాంపరింగ్ వివాదంతో కొట్టుమిట్టాడుతున్న స్టీవ్ స్మిత్ టెస్టులలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోగా.. 919 పాయింట్లతో విరాట్ కోహ్లీ రెండవ స్థానానికి పడిపోయాడు. ఆయన తర్వాతి స్థానాల్లో జోరూట్ (ఇంగ్లాండ్) 851 పాయింట్లతో మూడవ స్థానంలో ఉండగా.. 847 పాయింట్లతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలయమ్‌సన్ నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు.


ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టెస్టులో భారత ప్రదర్శన పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ కంటే ధోనియే కెప్టెన్‌‌గా గొప్ప సేవలు అందించాడని కూడా కొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చెత్తగా ఆడటం వల్లే తాము ఘోర పరాజయం పాలయ్యామని కోహ్లీ కూడా ఒప్పుకోవడంతో నెటిజన్లు ఇంకా తనపై మండిపడ్డారు. అయితే మూడో టెస్టుకి భారత్ తప్పకుండా కోలుకుంటుందని.. కోహ్లీ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.