ప్రపంచ కప్ గెల్చుకున్న టీమిండియా జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టెన్ ప్రస్తుత టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు గుప్పించాడు. తాను ఆడే ఆట గురించి ఇంకాఇంకా నేర్చుకోవాలనే తపన, ఆటలో నైపుణ్యాన్ని పెంపుందించుకునే అలవాటే విరాట్ కోహ్లీని ప్రపంచంలో ప్రముఖ క్రికెటర్ల సరసన నిలబెట్టిందని కిర్‌స్టెన్ కోహ్లీకి కితాబిచ్చాడు. తాను త్వరలోనే స్థాపించనున్న గ్యారీ కిర్‌స్టెన్ క్రికెట్ ఇండియా అకాడమి కోసం జాతీయ స్థాయిలో ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ప్రక్రియలో బిజీగా వున్న కిర్‌స్టెన్ తాజాగా గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీతో కలిసి పనిచేయడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. త్వరలోనే జరగనున్న ఇంగ్లండ్ పర్యటన కూడా ఎంతో ఎగ్జైట్‌మెంట్‌ని ఇవ్వనుంది అని కిర్‌స్టెన్ స్పష్టంచేశాడు. 


విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. ఎప్పటికప్పుడు తనని తాను మరింత మెరుగు పర్చుకుంటుంటాడు. ఇండియా-ఇంగ్లండ్ సిరీస్ కాస్త పోటీతో కూడుకున్నదే. రెండు పెద్ద జట్లు తలపడుతుంటే చూడటం అనేది మజాను ఇచ్చే అంశం అని కిర్‌స్టెన్ అభిప్రాయపడ్డాడు.