హార్థిక్ పాండ్య తిరిగి న్యూజీలాండ్‌తో జరిగిన 3వ వన్డేలో పునరాగమనం చేయడం చాలా మంచిదే అయ్యిందని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అతడు బౌలింగ్ చేసిన విధానం చూస్తే, అతడు ఆటపై ఎంత ఏకాగ్రత చూపించాడనే విషయం ఇట్టే అర్థమవుతుంది. జట్టును బ్యాలెన్స్ చేస్తూ జట్టులో అందరికన్నా ఎక్కువ ప్రతిభ కనబర్చగల ఆటగాడు హార్థిక్ పాండ్య అని టీమిండియా ఆల్ రౌండర్‌ను కోహ్లీ ప్రశంసల్లో ముంచెత్తినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది. 3వ వన్డే మ్యాచ్‌లో గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 


కాఫీ విత్ కరణ్ అనే టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో హార్థిక్ పాండ్యపై బీసీసీఐ నిషేధం విధించగా అనంతరం బీసీసీకి చెందిన పాలకుల కమిటీ అతడిపై నిషేధాన్ని ఎత్తివేసింది. నిషేధాన్ని ఎత్తివేసిన అనంతరం న్యూజీలాండ్‌తో 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరిగిన 3వ వన్డేలో ఆడిన హార్థిక్ పాండ్య.. తన బౌలింగ్‌తో మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.