గయానా: వెస్టిండీస్‌తో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఆ మ్యాచ్‌ ఆరు ఓవర్లు కూడా పూర్తికాకముందే.. భారీ వర్షంతో ఆటకు బ్రేకులు పడ్డాయి. ఓ గంట తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైనప్పటికీ.. ఈసారి మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. అలా 34 ఓవర్లతో ప్రారంభమైన మ్యాచ్..13 ఓవర్లు పూర్తయ్యాక మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను కాస్తా రద్దు చేశారు. అయితే, తొలి వన్డే మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోవడంపై టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆటకు మధ్యమధ్యలో పదేపదే అంతరాయం కలుగుతుంటే చిరాకుగా ఉంటుందన్న కోహ్లీ.. పడితే పూర్తిగా వర్షమైనా పడాలి, లేదంటే ఆటైనా పూర్తిగా కొనసాగాలి కానీ ఆ రెండూ జరగకపోతేనే చాలా చిరాకుగా ఉంటుందని అసహనం వ్యక్తంచేశాడు. 


వెస్టిండీస్‌లో పిచ్‌ల తీరుతెన్నులపై కోహ్లీ స్పందిస్తూ.. కొన్ని స్టేడియంలు పేస్‌కు, మరికొన్ని బౌన్స్‌కు అనుకూలిస్తాయని అభిప్రాయపడ్డాడు. ఏ పిచ్ ఎలా ఉంటుందో తెలుసుకుని ఆడిన జట్టే విజయం సాధిస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.