గౌహతి వేదికగా ఆదివారం భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కొహ్లీ, రోహిత్ శర్మలు శతకాలు చేయడంతో టీమిండియా 47 బంతులుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ వన్డే మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్‌లు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోహిత్, కోహ్లి కలిసి రెండోవికెట్‌కు 246 అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత బ్యాటింగ్‌ చరిత్రలో రికార్డు సృష్టించారు. అయితే ప్రపంచ క్రికెట్లో వీరిది రెండో స్థానం. 2009లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ రికీపాటింగ్‌- షేన్‌ వాట్సన్‌ కలిసి రెండో వికెట్‌కు 259 పరుగులు చేశారు



కోహ్లీ ఈ వన్డే ద్వారా  తన 36వ శతకాన్ని నమోదు చేశాడు. కెప్టెన్‌గా కోహ్లీకిది 14వ సెంచరీ. వన్డే మ్యాచ్‌లలో సచిన్ 49 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా 36 సెంచరీలతో సచిన్ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 204 ఇన్నింగ్స్‌లో 36 శతకాలు సాధించగా వన్డేలలో పదివేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. వరుసగా మూడుసార్లు 2000 పరుగులు (ఒక క్యాలెండర్‌ ఇయర్లో) చేసిన భారత బ్యాట్స్‌మన్లలో కోహ్లీ రెండవ వాడు. సచిన్‌ టెండూల్కర్‌ 1996, 1997, 1998 సంవత్సరాల్లో వరుసగా రెండువేల పైచిలుకు పరుగులను నమోదు చేశాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మాథ్యూ హైడెన్‌ 2004, 2005,2006 సంవత్సరాల్లో, జో రూట్‌ 2015, 2016, 2017 సంవత్సరాల్లో ఈ ఫీట్‌ను సాధించారు.


సచిన్ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ


టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గౌహతిలో జరిగిన తొలి వన్డేలో 152 పరుగులు చేశాడు. 117 బంతులుల్లో 15 ఫోర్లు 8 సిక్సర్లతో 150కి పైగా పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో ఎక్కువసార్లు 150కిపైగా పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.


రోహిత్‌ శర్మ 152 పరుగులతో వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా అత్యధిక పరుగులు చేసిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2011లో వీరేంద్ర సెహ్వాగ్‌ విండీస్‌పై 219 పరుగులు చేశాడు.



టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 5 సార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. రోహిత్ ఆరుసార్లు ఆ ఘనత సాధించి సచిన్ రికార్డును బద్దలుగొట్టాడు. కాగా, వన్డేల్లో రోహిత్ అత్యధిక స్కోరు 264 పరుగులు కావడం విశేషం.