ఐపీఎల్-11 సీజన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. తుది పోరుకు అర్హత సాధించినా టీమ్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌‌ను ధోని సరిగా ఉపయోగించుకోవడం లేదని.. సీనియర్‌ బౌలర్‌కు బంతినివ్వకపోవడం సరైన నిర్ణయం కాదని, ఎందుకు అతడికి బంతిని ఇవ్వలేదని ధోనిపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలపై ధోని చాలా తెలివిగా వివరణ ఇచ్చి విమర్శల నోళ్లు మూయించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సేవలను తక్కువగా వినియోగించుకోవడంపై కెప్టెన్ ధోనీ స్పందించారు. 'నా ఇంట్లో చాలా కార్లు, బైకులు ఉన్నాయి. అయితే ఒకేసారి అన్నింటిపై సవారీ చేయలేం కదా. అలాగే 6,7 బౌలర్లు మనకు అందుబాటులో ఉన్నప్పుడు.. పరిస్థితులను బట్టి ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారో గమనించాలి. ఆ సమయంలో అవసరమైన వారిని వినియోగించుకోవాలి. నేను అలానే నిర్ణయం తీసుకున్నా' అని మిస్టర్ కూల్ చెప్పుకొచ్చాడు.


‘అందుకే చివరి మ్యాచ్‌లో హర్భజన్‌ సేవలు అవసరమని అనిపించలేదు. అయితే ఏ ఫార్మాట్‌లోనైనా హర్భజన్‌ నిజంగా ఎంతో అనుభవమున్న ఆటగాడు’ అని ధోనీ అన్నాడు. ఈ వీడియో ఇప్పుడు  వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. అందుకే ధోని ది గ్రేట్‌ కెప్టెన్‌ అయ్యాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌లో చెన్నై తరఫున హర్భజన్‌.. మొత్తం 15 మ్యాచ్‌లకు గాను 13 మ్యాచ్‌లే ఆడాడు. 8.48 ఎకానమీతో ఏడు వికెట్లు తీశాడు.



కాగా నేడు సన్‌రైజర్స్‌‌తో  ఫైనల్లో చెన్నై అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో చెన్నై, సన్‌రైజర్స్‌ జట్టులు తలపడనున్నాయి.