West Indies vs India: విండీస్ టూర్‌లో భారత్‌కు తొలి ఓటమి.. రెండో టీ20లో ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం..
West Indies vs India, 2nd T20I : టీమిండియాతో రెండో టీ20లో విండీస్ సత్తా చాటింది. టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేసింది.
West Indies vs India 2nd T20I: విండీస్ టూర్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసి తొలి టీ20లో గెలుపుతో దూకుడు మీదున్న టీమిండియాకు విండీస్ బ్రేక్ వేసింది. బసేటెర్రెలోని వార్నర్ పార్క్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియాపై విండీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలగా.. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విండీస్ లక్ష్యాన్ని చేధించింది.
రెండో టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఓవర్ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ అంతా.. క్రీజులోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.హార్దిక్ పాండ్యా (31) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో టీమిండియా 19.4 ఓవర్లలో 138 పరుగులకే చాప చుట్టేసింది. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెక్కాయ్ 6 వికెట్లతో ఆ జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించాడు.హోల్డర్ 2 వికెట్లు, జోసెఫ్, హోసెన్ చెరో వికెట్ తీశారు.
139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన విండీస్‌కు మంచి శుభారంభమే లభించింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. 6.1 ఓవర్లో జట్టు స్కోర్ 46 పరుగుల వద్ద కైల్ మేయర్స్(8) రూపంలో తొలి వికెట్ పడింది. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ ధాటిగా ఆడి 52 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్‌లో డెవొన్ థామన్ 31 (19) పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఆవేశ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతి నో బాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ లభించడంతో క్రీజులో ఉన్న థామస్ సిక్సర్ బాదేశాడు. ఆ తర్వాతి బంతికి ఫోర్ బాదడంతో విండీస్ టార్గెట్‌ను చేధించింది. 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి విండీస్ 141 పరుగులు చేసింది. దీంతో ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించినట్లయింది. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, అశ్విన్, పాండ్యా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఆవేశ్ ఖాన్ 2.2 ఓవర్లలోనే 31 పరుగులు సమర్పించుకున్నాడు. తాజా మ్యాచ్‌లో విండీస్ విజయంతో ఐదు టీ20ల ఈ సిరీస్ 1-1తో సమం అయింది. విండీస్-టీమిండియా మధ్య మూడో టీ20 ఇవాళ జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.