పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదైంది. జింబాబ్వేతో జరిగిన నాల్గవ వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ క్రికెటర్ ఫకర్ జమాన్ తొలిసారిగా డబుల్ సెంచరీ నమోదు చేశారు. 156 బంతుల్లో 210 పరుగులు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. అలాగే వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరవ బ్యాట్స్‌మన్‌గా వార్తల్లోకెక్కారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయనకు కంటే ముందు స్థానాల్లో సచిన్ టెండుల్కర్ (2010లో దక్షిణాఫ్రికాపై 200 పరుగులు చేశారు), వీరేంద్ర సెహ్వాగ్ (2011లో వెస్టిండీస్‌ పై 219 పరుగులు చేశారు), రోహిత్ శర్మ (2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేశారు, అలాగే 2014లో శ్రీలంకపై 264 పరుగులు నమోదు చేశారు), క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై 215 పరుగులు చేశారు), మార్టిన్ గుప్తిల్ (2015లో వెస్టిండీస్ పై 237 పరుగులు చేశారు) మొదలైన వారు ఉన్నారు.


పాకిస్తాన్ క్రికెటర్ ఫకర్ జమాన్ తాజాగా నమోదు చేసిన డబుల్ సెంచరీలో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ డబుల్ సెంచరీ చేసిన జమాన్, పాకిస్తాన్‌లో సయిద్ అన్వర్ పేరిట ఉన్న (194 పరుగులు) రికార్డును బ్రేక్ చేశారు. 


ఈ రోజు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డు కూడా బ్రేక్ అయ్యింది. ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్‌తో కలిసి మొదటి వికెట్‌కి చేసిన పార్టనర్ షిప్ స్కోరు 304 పరుగులు కాగా, వారు గతంలో సనత్ జయసూర్య, ఉపల్ తరంగ చేసిన భాగస్వామ్య స్కోరుని (286)ని బ్రేక్ చేశారు.