నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు జరిగిన ఓ దుర్ఘటనలో ఆటో బావిలో పడడంతో 10 మంది ప్రయాణికులు మరణించారు. వివరాల్లోకి వెళితే, ఆటోరిక్షాలో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులు, వాహనం అదుపుతప్పి.. రోడ్డుపక్కనే ఉన్న నేలబావిలో పడిపోవడంతో అందులో మునిగిపోయారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బావిలో పడిన నలుగురు మహిళలు, ఆరుగురు పిల్లలు మరణించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోవడం వల్లే ఆటో అదుపుతప్పి పడిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరగగానే కొన్ని వందలమంది స్థానికులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే సమయానికి సహాయం అందించడానికి అవసరమైన సామగ్రి లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు బావిలో చిక్కుకుపోయిన వారిని తాడు సహాయంతో బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత బావిలోని నీటిని తోడడానికి యత్నించారు. 


ఈ వార్త అందగానే కలెక్టరు ఎం.రామమోహనరావు, కమీషనర్ కార్తికేయ సంఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అదనపు సహాయ సహకారాలను అందివ్వాలని సిబ్బందికి సూచించారు. అయితే ఇదే ప్రమాద ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆటోలో ఎక్కిన ప్యాసింజర్లు 20 మందికి పైగానే ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ వార్త వినగానే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తగిన సహాయాన్ని చేస్తామని తెలిపారు.