ప్రమాదవశాత్తుగా లిఫ్టులో చిక్కుకున్న ఓ 12 ఏళ్ల బాలుడు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఆశాదీపం ఆరిపోయింది. బర్కత్‌పురలో నివసిస్తూ కూలీనాలీ చేసుకుని బతుకీడుస్తోన్న కుటుంబానికి అండగా నిలుద్దామని భావించిన పన్నెండేళ్ల బాలుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వేసవి సెలవుల్లో నెలకు రూ.1,000 వేతనం కోసం నిత్యం అపార్ట్‌మెంట్లలో పేపర్ వేసే పేపర్ బాయ్‌గా ఓ పేపర్ ఏజెంట్ వద్ద పనికి చేరిన ఆ బాలుడు రోజూలాగే ఆరోజు కూడా ఆ అపార్ట్‌మెంట్‌లో పేపర్ వేయడానికి వెళ్లాడు. అపార్ట్‌మెంట్‌లో పేపర్ వేసి లిఫ్ట్‌లోంచి బయటికొచ్చిన బాలుడు మళ్లీ ఏదో మర్చిపోయినట్టుగా తిరిగి లిఫ్ట్‌లోకి ప్రవేశించబోయాడు. అయితే, అప్పటికే లిఫ్ట్ తిరిగి మరో అంతస్తు దిశగా కదలడంతో అనుకోకుండా బాలుడు లిఫ్ట్ గ్రిల్స్‌కు లిఫ్ట్ గోడకు మధ్య చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలుడి అరుపులతో అక్కడికి చేరుకున్న వాచ్ మన్‌కి తీవ్ర గాయాలతో గోడకు, లిఫ్ట్ గ్రిల్స్‌కి మధ్య వేళ్లాడుతున్న బాలుడు కనిపించాడు. రెండింటి మధ్య చిక్కుకోవడంతో బాలుడి శరీరం నుజ్జునుజ్జైంది. పోలీసుల సహాయంతో అతి కష్టంమీద లిఫ్ట్‌లో చిక్కుకున్న బాలుడిని వెంటనే బయటికి తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.


లిఫ్టులో చిక్కుకుని బాలుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసిన కాచిగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్‌లో రికార్డైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు మొదటిగా మైనర్ బాలుడిని పనిలో పెట్టుకున్న పేపర్ ఏజెంట్‌ని ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.