300 Stones In Kidney : 75 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధుడు వెన్ను నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు. ఆ వృద్ధుడి కుడి వైపున ఉన్న కిడ్నీలో 7 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో రాయి ఉన్నట్టు గుర్తించి షాక్ అయ్యారు. రాళ్ల కలయిక అంతా కలిసి ఒక పెద్దగా రాయిగా తయారైనట్టు నిర్ధారణకు వచ్చారు. తాజాగా అతడికి లేజర్ టెక్నాలజీ సహాయంతో ఆ పెద్ద రాయిని బ్లాస్ట్ చేసి కీ హోల్ సర్జరీ చేసి కిడ్నీలోంచి మొత్తం 300 రాళ్లను వెలికి తీశారు. హైటెక్ సిటీలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్యులు ఈ సర్జరీ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరీంనగర్ జిల్లాకు చెందిన రాంరెడ్డి అనే పేషెంట్ కి ఈ సర్జరీ చేశారు. రాంరెడ్డి వయస్సు 75 ఏళ్లు ఉండటంతో పాటు అతడికి డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత జబ్బులు వంటి సమస్యలు ఉన్నాయని.. కానీ తమ టీమ్ అతడికి శస్త్ర చికిత్స చేసి 300 రాళ్లు వెలికి తీశారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. సర్జరీ అయిన తరువాత రెండు రోజులకు పేషెంట్ ని డిశ్చార్జ్ చేసినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 


ఇదిలావుంటే, ఒక వ్యక్తి కిడ్నీలో 7 సెంటిమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో రాళ్లు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, తక్కువగా తాగు నీరు తీసుకోవడం వంటి అలవాట్ల వల్లే కాలక్రమంలో కిడ్నీలో రాళ్లు తయారవుతాయని వైద్యులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం, ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.