డిసెంబర్‌లోగా 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. బుధవారం ఘంటా టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 41 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చిందని.. డిసెంబర్‌ నాటికి 40 వేల పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ద్వారా 13వేల మంది ఉద్యోగాలు సాధించి.. వివిధ శాఖల్లో పని చేస్తున్నారని, మరో 19వేల పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. పంచాయతీ సెక్రటరీల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్న ఆయన.. టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాల్లో జాప్యం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదన్నారు.


టీఎస్‌పీఎస్సీ ఇటీవల 5 నియామక ప్రకటనలను విడుదల చేసింది. బెవరేజెస్‌ కార్పొరేషన్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌, పురపాలక శాఖ, డెయిరీ సమాఖ్యల్లో 293 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. అర్హత: ఇంటర్‌, డిగ్రీ.


జూన్ 2న టీఎస్‌పీఎస్సీ 1521 గ్రూప్ 4, 700 వీఆర్‌వో ఉద్యోగాల ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే 18,428 పోలీస్‌ ఉద్యోగాలకు మే 31న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటికే వెలువడ్డ ఈ ప్రకటనలతో ప్రిపరేషన్ మొదలుపెట్టారు.