ఆస్తి కోసం దారుణం.. రోకలిబండతో కొట్టి!
మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఆస్తి కోసం, ప్రేమ కోసం కుటుంబసభ్యులనే హతమారుస్తూ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు.
సూర్యాపేట : తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం సవతి తల్లిని, సోదరిని హతమార్చిన ఘటన సూర్యాపేట మండలం తాళ్ల ఖమ్మం పహాడ్‌లో కలకం రేపుతోంది. స్థానికంగా నివాసం ఉంటున్న హరీష్ ఆస్తి కోసం మారుతల్లి అంజమ్మతో కొన్ని రోజులుగా గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో అంజమ్మను, సోదరి మౌనికను పథకం ప్రకారం రోకలిబండతో మోది దారుణంగా హత్య చేశాడు. నిందితుడి సోదరి మౌనిక ఘటనాస్థలంలోనే చనిపోగా, తీవ్రంగా రక్తస్రావమైన అంజమ్మను సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె కూడా చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్తి పంపకాల విషయంలో గొడవ తలెత్తి ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.