హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆర్ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్ధి సంఘం (ఏబీవీపీ) విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం జరిగిన త్రిముఖ పోరులో ఏబీవీపీ ఆరు పదవులను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ అధ్యక్ష అభ్యర్థి పీహెచ్‌డీ స్కాలర్ ఆర్తి ఎన్ నాగపాల్ 1663 ఓట్లను పొందారు. ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్థి ఎర్రం నవీన్ కంటే 334 అధిక ఓట్లతో ఆమె గెలుపొందారు. యూడీఏ అభ్యర్థి శ్రీజ వాస్తవికి 842 ఓట్లు వచ్చాయి.


మిగితా ఐదు పోస్టుల్లో అమిత్ కుమార్ (వైస్ ప్రెసిడెంట్), ధీరజ్ శాంగోజీ (జనరల్ సెక్రటరీ), ఎస్ ప్రవీణ్ కుమార్  (జాయింట్ కార్యదర్శి), అరవింద్ ఎస్ కుమార్ (సాంస్కృతిక కార్యదర్శి), కె నిఖిల్ రాజ్ (క్రీడా కార్యదర్శి) గెలుపొందారు. అక్టోబర్ 5న ఎన్నికలు జరగ్గా.. శనివారం రాత్రి ఓట్ల లెక్కింపు జరిగింది.


అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన హెచ్‌సీయూ విద్యార్థి సంఘం నాయకురాలు ఆర్తి ఎన్ నాగపాల్ మాట్లాడుతూ..  పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడమే లక్ష్యమన్నారు. ప్రతి నెలా విద్యార్థి దర్బార్ నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.


'అఖిల భారత విద్యార్ధి సంఘం (ఏబీవీపీ) 8 సంవత్సరాల తర్వాత అన్ని సీట్లను కైవసం చేసుకుంది. ఇది మాకెంతో సంతోషం కలిగించే విషయం. విద్యార్థి సంఘాల అంచనాల ప్రకారం మేము పనిచేస్తాం' అని హెచ్‌సీయూకి కొత్తగా ఎన్నుకోబడిన అధ్యక్షురాలు ఆర్తి నాగపాల్ ఏఎన్ఐ వార్తా సంస్థకి తెలిపారు.