నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వద్ద ఆర్టీసీ బస్సు ఆదివారం ప్రమాదానికి గురైంది. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు వట్టెం గ్రామం వద్ద పేలిపోవడంతో.. బస్సు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. యాదగిరి గుట్ట డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి వనపర్తి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుల్లో పలువురు వీఆర్వో పరీక్ష అభ్యర్థులు ఉన్నారు. క్షతగాత్రుల్లో వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిజినేపల్లి బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. డ్రైవర్లు, కండక్టర్లు నిబంధనలు పాటించి తీరాలని, నిర్లక్ష్యం, మితిమీరిన వేగం పాటించవద్దని హెచ్చరించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను  ఆదేశించిన ఆయన..ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు.


కాగా.. కొండగట్టు ఘోర ప్రమాదం నుంచి ఇంకా తేరుకోకముందే మరోసారి ఇలాంటి ప్రమాదం సంభవించడంతో ప్రజలు ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటేనే భయపడుతున్నారు.