BRSV Meeting With KTR: తెలంగాణకు తమ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్‌ శ్రీరామరక్ష అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. 'తెలంగాణ ఉద్యమంలో మహా ఉద్ధండ పిండాలతో కొట్లాడినం. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలాంటి వాళ్లతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అంతటి ఉద్ధండుల ముందు ఈ చిట్టి నాయుడు ఎంత?' అని పశ్నించారు. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీనేనని స్పష్టం చేశారు. పది నెలల కాలంలో ప్రజలకు మళ్లీ కేసీఆర్‌ గుర్తుకు వస్తున్నారని తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Group 1 Mains: గ్రూప్‌ 1పై ముందుకే తెలంగాణ సర్కార్‌.. తగ్గేదెలే అంటున్న రేవంత్‌ రెడ్డి


 


హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించారు. విద్యార్థి నాయకులకు దిశానిర్దేశం చేసిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన ఖర్మ అని పేర్కొన్నారు. 'గుంపు మేస్త్రీ అంటే ఇళ్లు కట్టేటోళ్లు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇళ్లను కూలగొట్టేటోడు. పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రేవంత్ రెడ్డి బాధపెట్టినా సరే ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది' అని గుర్తుచేశారు.

Also Read: KTR Group 1 Aspirants: అర్ధరాత్రి గ్రూప్‌ 1 అభ్యర్థుల మొర.. వస్తున్నా అంటూ కేటీఆర్‌ ట్వీట్


 


'తెలంగాణకు మంచి జరిగితే మాకు మంచి జరిగినట్టే భావిస్తామని సంతోషంతో రొమ్ము విరుచుకొని చెప్పే వాళ్లం. శ్రీకాంత్ చారి, యాదిరెడ్డి, ఇషాంత్ రెడ్డి లాంటి వందల మంది విద్యార్థుల త్యాగాలతో పునీతమైన నేల తెలంగాణ. నీళ్లు, నియామకాలు, నిధులు అనే నినాదాన్ని ప్రామాణికంగా పనిచేశాం. నీళ్ల రంగంలో సంపూర్ణ విజయం సాధించాం. కాళేశ్వరం పూర్తి చేశాం. పాలమూరు-రంగారెడ్డి పనులు 90 శాతం పూర్తి చేశాం' అని కేటీఆర్‌ తెలిపారు.


'నల్గొండలో ఫ్లోరోసిస్‌ను పూర్తిగా తుడిచి వేసిన ఘనత కేసీఆర్‌ది. తలసరి ఆదాయంలో రాష్ట్రం ఏర్పడే నాటికి మనది 14వ స్థానం. కేసీఆర్ దిగిపోయేనాటికి నంబర్ వన్‌గా నిలిచి కాలర్ ఎగరవేసుకొని పరిస్థితి వచ్చింది. నీళ్లు, రైతుబంధు సహా భూముల విలువ పెంచ కేసీఆర్ రైతుల్లో ధీమా నింపారు. 'రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలకు కష్టం వచ్చినా సరే ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. ప్రజలకు కష్టమొస్తే గాంధీ భవన్, బీజేపీ ఆఫీస్‌కు కాదు.. తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, గ్రూప్‌ 1 మెయిన్స్‌ అభ్యర్థులు ఇలా ఎంతో మంది కలుస్తున్నారు' అని కేటీఆర్‌ వివరించారు.


'చిట్టి నాయుడు పాలనలో బాధపడని వాళ్లు లేరు. ఊళ్లలో రైతులు పొట్టు పొట్టు తిడుతున్నారు. తులం బంగారం, బతుకమ్మ చీరలు ఏదీ దిక్కులేని పరిస్థితి తెచ్చారన్నారని మండిపడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆడబిడ్డలను ఇంటి ఆడపడుచును చూసుకున్నట్టు చూసుకున్నాడని గుర్తు చేసుకున్నారు. టెన్త్ పాసైతే చాలు పది వేలు, ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ పాసైతే 25 వేలు, పీజీ పాసైతే లక్షా, పీహెచ్ డీ చేస్తే లక్షా అన్నాడు. ఎవరికైనా వచ్చాయా?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.


'ఈ సన్నాసి సీఎం ఏం చేస్తున్నాడు. స్కూళ్లలో  చాక్‌పీస్‌లకు కూడా పైసలు లేవు. కానీ మూసీలో  పారబోసేందుకు లక్షా 50 వేల కోట్లు ఉన్నాయంట. గురుకులాల అద్దె కట్టేందుకు డబ్బులు లేవు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.లక్షల కోట్లు దోచిపెడుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు ఏం రోగం ఈ ముఖ్యమంత్రికి' అని కేటీఆర్‌ నిలదీశారు. '25 సార్లు ఢిల్లీకి పోయి రూ.25 పైసలు తేలేదు. తన సీటు కాపాడుకునేందుకు హైకమాండ్ కు కప్పం, ఢిల్లీకి మూటలు సర్దేందుకే ముఖ్యమంత్రికి సమయం సరిపోతోంది' అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.


'కేసీఆర్ సమయంలో గురుకులాల విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే చిట్టి నాయుడు మాత్రం గురుకులాలను పాతాళంలోకి తీసుకెళ్తున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణను తీసుకపోయి ఆంధ్రాలో కలపాలి. తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేస్తామంటే ఏ మూర్ఖులకు ఏం చెప్పాలె' అని కేటీఆర్‌ సందేహం వ్యక్తం చేశారు. 'ప్రశ్నించకపోతే తెలంగాణ మూగబోతుంది. కాంగ్రెస్ వాడు ఏం చేసిన బీజేపీ వాళ్లు మాట్లాడటం లేదు. పైన జుమ్లా పీఎం ఉంటే  ఇక్కడేమో హౌలా సీఎం ఉన్నాడు' అని ఎద్దేవా చేశారు.


'రేవంత్‌ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆగమాగం జగన్నాథం అన్నట్లు ఉన్నాడు. కాంగ్రెస్ మళ్లీ గెలిచేది లేదని నడిచినన్నీ రోజులు నడుస్తుదని ఎవరి దుకాణం వాళ్లు తెరుచుకుంటున్నారు. అందినకాడికి దోచుకో.. అవన్నీ దాచుకో అని కాంగ్రెస్ వాళ్ల యవ్వారం ఉంది. కొన్ని పొరపాట్లు, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన అడ్డగోలు హామీలతో మనం ఓడిపోయాం. దసరా రోజు ప్రతి ఇంట్లో ప్రజలు కేసీఆర్‌ను తలుచుకున్నారు. కాంగ్రెస్ కాదు తెలంగాణకు అతి ప్రమాదకరమైన పార్టీ బీజేపీ. మతాన్ని అడ్డంపెట్టుకొని రెచ్చగొట్టే పార్టీ బీజేపీ. మనకు ఒక్క మెడికల్, నర్సింగ్, నవోదయ పాఠశాల ఇవ్వలేదు. తెలంగాణ విద్యార్థులకు ఏం చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు' అని కేటీఆర్‌ వివరించారు.


విద్యార్థి విభాగానికి దిశానిర్దేశం
'ప్రతి జిల్లాల్లో బీఆర్ఎస్వీ సమావేశాలు జరగాలి. ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించుకుందాం. మన పార్టీలో ఎంతో మంది యువ నాయకులు ఉన్నారు. వాళ్లను ప్రోత్సహించుకుందాం. మనకు  చాకుల్లాంటి యువ నాయకత్వం ఉంది. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. బీఆర్ఎస్వీ జెండా లేని కాలేజ్ మనకు కనిపించవద్దు' అని కేటీఆర్‌ తెలిపారు. 'సోషల్ మీడియాలో మనమే పోరాటం చేయాలే. కేసులు పెట్టినా సరే భయపడవద్దు. మన లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసుకుందాం. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా మారిపోయారు. మనం సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికీ పంపించాలి' అని కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి