తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్రసమితి)లో మళ్లీ విభేదాలు మొదలయ్యాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలత, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనను కించపరుస్తున్నారని చెబుతూ.. టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దాంతో కరీంనగర్ రాజకీయాల్లో మళ్లీ అలజడి మొదలైంది.


వార్డు అభివృద్ధి పనులకు డబ్బులు కేటాయించడం లేదని.. భూవివాదంలో తన భర్తను ఇరికించారని చెబుతూ ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఆమె ఎమ్మెల్యేపై తీవ్ర అభియోగాలు కూడా చేశారు. తన కుటుంబాన్ని ఎమ్మెల్యే వేధిస్తున్నారని.. ఆ వేధింపులను ఆపకపోతే తాను ఎమ్మెల్యే ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని శ్రీలత మీడియాతో తెలిపారు. గతంలో కూడా జయశ్రీ అనే కార్పొరేటర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై ఇదే విధమైన ఫిర్యాదు చేయడం గమనార్హం. ప్రస్తుతం కరీంనగర్ లోక్‌సభ ఎంపీగా బి.వినోద్ కుమార్ కొనసాగుతున్నారు.