హైదరాబాద్: తెలంగాణ శాసన సభకు శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని భారీ సంఖ్యలో ఓటర్లు ఫిర్యాదు చేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందిస్తూ.. ఓట్లు గల్లంతయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 26 నుంచి తిరిగి ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా రజత్ కుమార్ తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూస్తామని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఎన్నికలు ముగిసిన అనంతరం ఎన్నికల సరళి వివరాలు మీడియాకు వెల్లడించే క్రమంలో రజత్ కుమార్ ఈ ప్రకటన చేశారు. 


ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తమకు 4,292 ఫిర్యాదులు అందాయని, ఆయా ఫిర్యాదులన్నింటిపై వెంటనే విచారణ జరిపించి, పరిష్కరించామని రజత్ కుమార్ మీడియాకు తెలిపారు.